తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

  • దేవికారాణి సహా 15 మందిపై అభియోగాలు
  • ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాఫ్తు
  • ఇప్పటికే 144 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన అధికారులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటు మొత్తం 15 మందిపై అభియోగాలు మోపింది. ఏసీబీ అభియోగాల ఆధారంగా కేసు విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

మెడికల్ క్యాంపుల పేరుతో నిధుల గోల్ మాల్ జరిగినట్లు అధికారులు తేల్చారు. అదేవిధంగా సర్జికల్ కిట్స్, మందుల పంపిణీ పేరుతో దేవికా రాణి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నకిలీ ఇన్వాయిస్ లు తయారుచేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని వివరించారు. ఈఎస్ఐ లో సుమారు రూ.211 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చిన ఏసీబీ.. మనీలాండరింగ్ ఆరోపణలతో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికా రాణి సహా పలువురిని అరెస్టు చేసింది. కాగా, అక్రమ సంపాదనతో దాదాపు రూ.6 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలను పోగేశారని అధికారులు తెలిపారు. దేవికా రాణితో పాటు ఫార్మసిస్టు నాగలక్ష్మి కూడా భారీగా ఆస్తులు పోగేశారని, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు.



More Telugu News