కంగ్రాట్స్ చెప్పిన సీఎం జగన్.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ!

  • జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
  • అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు
  • బెస్ట్ విషెస్ అంటూ స్పందించిన ఏపీ సీఎం జగన్
  • టాలీవుడ్ కు గర్వకారణమన్న తెలంగాణ మంత్రి తలసాని
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు లభించడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. 

"అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తరుణంలో నా బెస్ట్ విషెస్. అలాగే కంగ్రాచ్యులేషన్స్ కూడా. 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు జెండా సమున్నతంగా ఎగసింది. పుష్ప చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ కు, ఆర్ఆర్ఆర్ చిత్రం పాప్యులర్ ఫిల్మ్, మరో ఐదు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకోవడం పట్ల రాజమౌళితో పాటు యావత్ చిత్ర బృందానికి అభినందనలు. కొండపొలం చిత్రంలోని గీతానికి గాను పాటల రచయిత చంద్రబోస్ కు శుభాభినందనలు" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

సీఎం జగన్ ట్వీట్ పట్ల అల్లు అర్జున్ వినమ్రంగా స్పందించారు. "థాంక్యూ సో మచ్ జగన్ గారు. మీ సందేశం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీ హృదయపూర్వక సందేశానికి కృతజ్ఞతలు" అంటూ బన్నీ బదులిచ్చారు.

అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు టాలీవుడ్ కు గర్వకారణం: తలసాని

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు. 69వ జాతీయ సినిమా అవార్డులలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని అభివర్ణించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పలు కేటగిరీల్లో జాతీయ అవార్డులు పొందడం ఆనందదాయకమని తలసాని పేర్కొన్నారు. జాతీయ స్థాయి సినీ అవార్డులతో తెలుగు వారి ఆత్మగౌరవం మరింత ఇనుమడించిందని తెలిపారు.


More Telugu News