రెండేళ్ల క్రితమే రావాల్సిన తీర్పు ఇది: బీజేపీ నేత డీకే అరుణ

  • గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
  • హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ
  • ఈ తీర్పు గద్వాల నియోజకవర్గ ప్రజలకు ఆనందాన్నిచ్చిందని వ్యాఖ్య
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఈ తీర్పు తనకు, గద్వాల నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అసలు రెండేళ్ల క్రితమే రావాల్సిన తీర్పు అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్)లోనూ ట్వీట్ కూడా చేశారు.

సత్యమేవ జయతే... ధర్మమే గెలిచింది... అసత్యాలకు, అక్రమాలకు ఎప్పటికైనా గుణపాఠం తప్పదు అంటూ ఆమె ట్వీట్‌ను ప్రారంభించారు. తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అసత్యాలు ప్రచారం చేయడం, చివరకు ఎన్నికల అఫిడవిట్ ను కూడా తప్పుగా సమర్పించడం, ట్యాంపరింగ్ చేయడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు ఎన్నికల ప్రక్రియ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గల విశ్వాసం ఏ పాటితో తేటతెల్లమవుతోందన్నారు.

రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఈ అరాచక శక్తులకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు కోరుతూ విజయం సాధిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో ఈరోజు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పే తిరిగి ప్రజల ఆశీస్సులతో పునరావృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలతో కూడిన నవ తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. 

కాగా, గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను హైకోర్టు ఈ రోజు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేయడంతో పాటు డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News