భారత్ వరల్డ్ కప్ గెలవాలంటే...!: గంగూలీ

  • భారత్ లో అక్టోబరు 5 నుంచి వరల్డ్ కప్
  • వరల్డ్ కప్ ముందు ఆసియా కప్, ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న భారత్
  • బ్యాట్స్ మన్లే జట్టు రాతను మార్చుతారన్న గంగూలీ
  • సొంతగడ్డపై బ్యాటింగే కీలకమని వెల్లడి
భారత్ లో మరి కొన్ని వారాల్లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా అవకాశాలపై మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా పటిష్ఠంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని అన్నారు. అయితే, సొంతగడ్డపై వరల్డ్ కప్ ను టీమిండియా గెలవాలంటే, బ్యాట్స్ మెన్ రాణించాల్సి ఉంటుందని గంగూలీ స్పష్టం చేశారు. 

ప్రతిసారీ వరల్డ్ కప్ నెగ్గడం సాధ్యం కాదని, కొన్నిసార్లు కాలం కలిసిరాకపోవచ్చని అన్నారు. ఏదేమైనా మన బ్యాట్స్ మెన్ స్థాయికి తగ్గట్టుగా ఆడితేనే టీమిండియా కప్ విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బాగా బ్యాటింగ్ చేసిన రోజున టీమిండియాను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. 

వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆసియా కప్, ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలోనూ గంగూలీ స్పందించారు. "వరల్డ్ కప్ విభిన్నమైనది. ఆసియా కప్ కూడా ప్రత్యేకమైనది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగబోయే వన్డే సిరీస్ కు సైతం దాని గుర్తింపు దానికి ఉంది. ప్రత్యేకించి ఒక్కో ఈవెంట్ లో ఎలా ఆడతారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. జట్టు పరంగా భారత్ బలంగానే ఉంది. వరల్డ్ కప్ లోనూ స్థాయికి తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుంది" అంటూ దాదా పేర్కొన్నారు. 

ఇక, ఆసియా కప్ కు ఎంపిక చేసిన 17 మందిలో చహల్ కు కాకుండా అక్షర్ పటేల్ కు చోటివ్వడంపైనా గంగూలీ తన అభిప్రాయాలను వెల్లడించారు. బహుశా బ్యాటింగ్ కూడా చేస్తాడన్న ఉద్దేశంతోనే అక్షర్ పటేల్ ను సెలెక్టర్లు ఎంపిక చేసి ఉండొచ్చని తెలిపారు. ఒకవేళ ఎవరైనా గాయపడితే చహల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.


More Telugu News