ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డును అందుకున్న 'కడైసీ వివసాయి' కథ ఇదే!

  • 2022లో విడుదలైన 'కడైసీ వివసాయి'
  • 86 ఏళ్ల వృద్ధుడే కథానాయకుడు 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • వ్యవసాయంతో ముడిపడిన జీవితాల ఆవిష్కరణ 
  • ఎమోషన్స్ తో కట్టిపడేసే సహజమైన సన్నివేశాలు
69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. తమిళం నుంచి 'కడైసీ వివసాయి' (ది లాస్ట్ ఫార్మర్) ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది. 2022 ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమా విడుదలైంది. మణికందన్ ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను అందించడమే కాకుండా, దర్శక నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఈ సినిమాలో కథానాయకుడు 86 ఏళ్ల వృద్ధుడు. తాను పుట్టిపెరిగిన ఊరు .. తన పూర్వీకుల నుంచి వచ్చిన కొద్ది పాటి పొలం .. చిన్నపాటి గుడిసె .. ఇదీ అతని ఆస్తి. ఏ పంటకి ఏ సమయంలో ఏం కావాలో తెలిసిన అనుభవం ఆయన సొంతం. ఊళ్లో వాళ్లంతా ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఉంటారు. ఆకలితోనైనా ఉంటాడుగానీ .. అప్పు మాత్రం చేయడు. అలాంటి ఆయన పొలాన్ని కాజేయడానికి కొంతమంది పెద్దలు ప్లాన్ చేస్తారు. 

ఆ రైతు తన పొలంలో చనిపోయి ఉన్న మూడు నెమళ్లను పూడ్చేస్తాడు. ఆ పెద్ద తలకాయలు ఆయనే ఆ నెమళ్లను చంపాడని కేసు పెడతారు. పోలీస్ వ్యవస్థ .. కోర్టు .. వాదనలు ఇవేమీ ఆయనకి  పట్టవు. తన పొలానికి నీళ్లు పెట్టాలి .. తన పశువులకు మేత వేయాలి .. అదే ఆయన ఆలోచన. ఆయనలోని ఆ తపనే జడ్జిని కూడా కదిలిస్తుంది. ఆమెనే నేరుగా అతన్ని ఆ పొలం దగ్గరికి తీసుకుని వచ్చి దింపేసి వెళుతుంది.

గ్రామీణ జీవితం .. వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవితం .. అక్కడి నమ్మకాలు .. ఆచారాలు .. ప్రకృతితో .. పశువులతో .. పక్షులతో ముడిపడిపోయిన జీవితలను ఈ కథలో ఆవిష్కరించారు.  రైతు తన పొలానికి .. తాను అలవాటు పడిన ప్రకృతికి దూరంగా బ్రతకలేడని చాటిచెప్పే ఈ కథ మనసును కదిలించి వేస్తుంది .. కన్నీళ్లు పెట్టిస్తుంది.



More Telugu News