బీజేపీ కార్టూన్‌పై మండిపడ్డ కవిత

  • అసమ్మతి తెలియజేసే వారి గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కవిత
  • కార్టూన్ల కంటే గట్టిగా చర్యలు మాట్లాడుతాయని వ్యాఖ్య
  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై పని ప్రారంభించాలని హితవు
సోషల్ మీడియాలో తనను విమర్శిస్తూ బీజేపీ పెట్టిన కార్టూన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను అవహేళన చేస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘ఇది చూడటానికి చాలా నిరుత్సాహంగా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. బీజేపీ నాపై చేస్తున్న దాడి.. మహిళలపై పాత మూస పద్ధతులను కొనసాగిస్తోందని తెలియజేస్తోంది” అని విమర్శించారు.

అసమ్మతి తెలియజేసే వారి గొంతు నొక్కడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని కవిత ఎద్దేవా చేశారు. ‘‘కార్టూన్ల కంటే గట్టిగా చర్యలు మాట్లాడుతాయి. కాబట్టి వేధింపులు ఆపి, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు పని ప్రారంభించండి” అని హితవుపలికారు.  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో మహిళలకు తక్కువ సీట్లు కేటాయించారు. దీన్ని విమర్శిస్తూ బీజేపీ ట్వీట్ చేసింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కవిత ఢిల్లీలో గొంతెత్తినట్లు, తెలంగాణలో నిద్రపోతున్నట్లు ఓ కార్టూన్‌ను షేర్ చేసింది. దీనికి ‘‘33% రిజర్వేషన్‌పై కవిత మౌనం. బీఆర్ఎస్‌లో మహిళలకు దక్కని న్యాయం” అని క్యాప్షన్ ఇచ్చింది.


More Telugu News