భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌కు షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన యూడబ్ల్యూడబ్ల్యూ.. మల్లయోధుల పరిస్థితేంటి?
- డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకటన
- ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించనందుకు వేటు
- భారత రెజ్లర్లపై తీవ్ర ప్రభావం
- దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం
- సెప్టెంబర్ 16 నుంచి టోర్నీ ప్రారంభం.. తటస్థ అథ్లెట్లుగా భారత రెజ్లర్లు?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు (డబ్ల్యూఎఫ్‌ఐ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ప్రకటించింది. ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించలేదన్న కారణంతో సస్పెన్షన్ వేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చిందని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామం భారత రెజ్లర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 16 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం పునరుద్ధరించకపోతే.. భారత రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడాల్సి ఉంటుంది.
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను ఐఓఏ రద్దు చేసింది. కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని, లేదంటే సస్పెన్షన్ వేటు పడుతుందని ఏప్రిల్ 28 యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించింది. పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసింది.