చాహల్ కంటే గొప్ప స్పిన్నర్ లేడు.. జట్టు సెలెక్షన్ పై హర్భజన్ సింగ్ మండిపాటు

  • కొంత కాలంగా చాహల్ ను దూరం పెట్టిన టీమిండియా సెలెక్టర్లు
  • ఇండియాలో బెస్ట్ స్పిన్నర్ చాహల్ అంటూ హర్భజన్ కితాబు
  • వరల్డ్ కప్ జట్టులో చాహల్ ఉండటం అవసరమని వ్యాఖ్య
టీమిండియా జట్టుకు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ను దూరం పెట్టడంపై మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ కు చాహల్ ఆడని సంగతి తెలిసిందే. ఆ టోర్నీ తర్వాత కూడా చాహల్ కు జట్టులో స్థానం లభించలేదు. ప్రస్తుతం ఆసియా కప్ కు సెలెక్ట్ చేసిన జట్టులో కూడా చాహల్ లేడు. 

ఈ నేపథ్యంలో హర్భజన్ స్పందిస్తూ, జట్టులో చాహల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు. బంతిని అద్భుతంగా టర్న్ చేయగల సత్తా ఉన్న బౌలర్ అని కితాబునిచ్చాడు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో ఇండియాలో బెస్ట్ స్పిన్నర్ ఎవరని అడిగితే... తాను కచ్చితంగా చాహల్ పేరే చెపుతానని అన్నాడు. గత కొన్ని మ్యాచ్ లలో ఆయన సరిగా రాణించలేకపోయి ఉండొచ్చని... అంత మాత్రాన చాహల్ ను పనికిరాని బౌలర్ గా ఎలా చెపుతామని ప్రశ్నించాడు. 

వన్డే ప్రపంచ కప్ జట్టులోకి చాహల్ వస్తాడనే ఆకాంక్షను హర్భజన్ వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ జట్టులో చాహల్ ఉండటం అత్యంత అవసరమని చెప్పాడు. చాహల్ కు ద్వారాలు ఇంకా మూసుకుపోలేదని అన్నాడు. వరల్డ్ కప్ ఇండియాలో జరగుతున్న నేపథ్యంలో, జట్టుకు చాహల్ సేవలు అవసరమని చెప్పాడు. చాహల్ మ్యాచ్ విన్నర్ అని కితాబిచ్చాడు.


More Telugu News