చంద్రయాన్-3: ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ ఇలా...

  • సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం
  • గం.5.44 సమయానికి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం
  • ఈ పదిహేడు నిమిషాలు ఇక కీలకం..
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి చేరువైంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండింగ్ మాడ్యూల్‌ను తనిఖీ చేశారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగడానికి సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. బుధవారం సాయంత్రం గం.5.44 సమయానికి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకోవాలి. 

ల్యాండర్ మాడ్యూల్‌లో పారామీటర్లన్నింటినీ తనిఖీ చేసి ఎక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ నుండి ఇస్రో సంబంధిత కమాండర్లను ల్యాండర్ మాడ్యూల్‌కు అప్ లోడ్ చేస్తుంది. ల్యాండింగ్ షెడ్యూల్‌కు రెండు గంటల ముందు ఇది జరుగుతుంది.

చంద్రుడి ఉపరితలానికి 30 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగు పెడుతుంది. ఇక్కడి నుండి చివరి 17 నిమిషాలు కీలకం. దీనిని టెర్రర్ టైమ్ అంటారు. 

చంద్రుడికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. క్రమంగా వేగాన్ని తగ్గించుకోవడం ద్వారా చంద్రుడికి దగ్గరయ్యే కొద్దీ ల్యాండర్ కుప్పకూలకుండా ఉంటుంది.

చంద్రుడి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కిలో మీటర్లుగా ఉంటుంది. చంద్రుడి ఉపరితలానికి 6.8 కిలో మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆప్ చేసి, మరో రెండు ఇంజిన్లనే ఉయోగించుకొని, వేగాన్ని మరింత తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో మరింత కిందకు వస్తుంది.

చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ఉంటుంది. 11 నిమిషాల్లో జరిగే ఈ ప్రక్రియను రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఆ తర్వాత ఫైన్ బ్రేకింగ్ దశలోకి వెళ్తుంది. అక్కడ చంద్రయాన్ 3 తొంబై డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వస్తుంది. గతంలో చంద్రయాన్ 2 ఇదే సమయంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది.

ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు పడిపోతాయి. అప్పుడు ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం వెతుకుతుంది.

ల్యాండర్ ఆ తర్వాత మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు చేరుకొని, మరోసారి ల్యాండింగ్ కోసం చూస్తుంది. బండలు, గుట్టలు వంటివి లేని ప్రదేశం కోసం చూస్తుంది.

అన్నీ అనుకూలంగా కనిపిస్తే రెండు ఇంజిన్ల సాయంతో చంద్రుడిపై అడుగు పెడుతుంది. అప్పుడు దాని కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి. ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సర్లు చంద్రుడి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఈ పదిహేడు నిమిషాల ప్రక్రియకు అప్పుడు తెరపడుతుంది.


More Telugu News