ఐపీఎల్​ వైరాన్ని టీమిండియాకు ఆపాదిస్తారా? అభిమానులపై అశ్విన్​ ఆగ్రహం

  • ఆసియా కప్ జట్టుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య గొడవ
  • జాతీయ జట్టుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన అశ్విన్
  • ఇష్టమైన ఆటగాడు జట్టులో లేకపోతే ఇతరులను కించపరచవద్దని సూచన
ఆసియా కప్ కోసం టీమిండియా ఎంపిక సహేతుకంగా లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఐపీఎల్ సమయంలో ఆయా జట్ల మధ్య మైదానంలో ఉండే వైరాన్ని అభిమానులు భారత జట్టుకు ఆపాదిస్తున్నారన్నాడు. ఈ ఐపీఎల్ వైరాన్ని వీడి జాతీయ జట్టుకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు.  ఆసియా కప్ జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను ఉదాహరణగా తీసుకుని తన యూట్యూబ్ చానల్లో అభిమానులకు సందేశం ఇచ్చాడు. 

‘ఈ ఐర్లాండ్ సిరీస్‌లో తిలక్ ఇప్పటివరకు పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ అతను మొదటి బంతి నుంచే అనూహ్యమైన ఉద్దేశాన్ని కనబరుస్తున్నాడు. ఈ కుర్రాడు స్పష్టమైన ఆలోచనతో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అతను జట్టులోకి కొంత తాజాదనాన్ని తీసుకువస్తున్నందున సెలక్టర్లు అతనికి బ్యాకప్ స్థానం కోసం మద్దతు ఇచ్చారు. సూర్య కుమార్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అతని బ్యాటింగ్‌లో ఆ ఎక్స్-ఫాక్టర్ ఉంది కాబట్టే వన్డే ఫార్మాట్‌లో కూడా మెరుగ్గా రాణించాలని జట్టు అతనికి మద్దతు ఇస్తోంది. ఆటగాడిని తొలగించడం లేదా ఎంపిక చేయడం గురించి అనుకూల, వ్యతిరేక చర్చ ఆరోగ్యకరంగానే ఉండాలి. అంతేతప్ప ఒకరిని కించపరిచేలా వుండకూడదు’ అని సూచించాడు. 
 
సూర్యకుమార్ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిని విమర్శించవద్దని అశ్విన్ కోరాడు. ‘తనో మ్యాచ్ విన్నర్, టీ20ల్లో నమ్మదగ్గ ఆటగాడు, జట్టులో అతని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని విమర్శించడం వద్దు. నేనైతే ఇదంతా కేవలం ఐపీఎల్ వైరం మాత్రమే అనుకుంటున్నా. ప్రపంచ కప్‌ ఆడబోతున్నప్పుడు మన ఆటగాళ్లందరినీ భారత దేశానికి ప్రతినిధులుగా చూడాలి. కాబట్టి ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇక దాన్ని పక్కనబెట్టండి. ఒక ఆటగాడు భారత్ తరఫున ఆడితే అతను ఐపీఎల్‌లో బాగా ఆడాడని అంగీకరించండి. ఐపీఎల్ తర్వాత కూడా అభిమానులు యుద్ధానికి దిగుతున్నారు. ఇది సరైనది కాదు. మీకు ఇష్టమైన వారు జట్టులో లేకపోతే ఇతరులను కించపరచవద్దు’ అని అశ్విన్ సూచించాడు.


More Telugu News