తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి

  • విద్యార్థులకు చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను లైవ్‌లో చూపించాలని తొలుత ఆదేశం
  • అందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ ఉత్తర్వులు
  • చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు, స్కూలు విడిచిపెట్టే వేళలకు మధ్య రెండు గంటల వ్యత్యాసం
  • దీని వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఉత్తర్వులు వెనక్కి
  • కావాలంటే రేపు యూట్యూబ్‌లో చూపించాలని సూచన
జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ను లైవ్‌లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది. చంద్రయాన్3లోని ల్యాండర్ విక్రమ్ నేటి సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై కాలుమోపనుంది. ఇస్రో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

అయితే, జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయానికి, స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి మధ్య భారీ తేడా ఉండడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సాధారణంగా స్కూళ్లు 4.30 గంటలకే ముగుస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను 6.30 గంటల వరకు స్కూళ్లలోనే ఉంచడం సరికాదని, దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తొలుత జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. కావాలంటే రేపు మధ్యాహ్నం యూట్యూబ్ ద్వారా చంద్రయాన్ ల్యాండింగ్‌ను చూపించవచ్చని తెలిపింది.


More Telugu News