మేము I.N.D.I.A. కూటమిలో ఉండటం బీఆర్ఎస్ కు నచ్చలేదని చెప్పారు: సీపీఎం నేత తమ్మినేని

  • ఎన్డీయే, I.N.D.I.A. కూటమిలకు సమదూరంలో ఉంటారని చెప్పినట్లు వెల్లడి
  • కేరళలో కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు కలిశామని వ్యాఖ్య
  • కేసీఆర్ రాజకీయ విధానంలో సమస్య వచ్చిందన్న తమ్మినేని
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో చర్చలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు... కమ్యూనిస్ట్ పార్టీలు I.N.D.I.A. కూటమిలో ఉండటం తమకు నచ్చలేదని చెప్పారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైదరాబాద్ మగ్దం భవన్‌లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సమావేశం అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీయే, I.N.D.I.A. కూటమిలకు సమదూరంలో ఉంటామని బీఆర్ఎస్ నేతలు చెప్పారన్నారు. అందుకే వారికి తాము I.N.D.I.A. కూటమిలో ఉండటం నచ్చలేదన్నారు. కేరళలో తమకు కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నాయని, కానీ బీజేపీని ఓడించేందుకు కలవాల్సి వచ్చిందని అన్నారు.

కేసీఆర్‌కు రాజకీయ విధానంలో సమస్య వచ్చిందన్నారు. అందుకే ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారన్నారు. తాము కోరిన సీట్లలోను అభ్యర్థులను ప్రకటించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలుస్తామని కేసీఆర్ పలుమార్లు చెప్పారని, కానీ ఇప్పుడు అలా జరగలేదన్నారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదని, కేసీఆర్ రాజకీయ వైఖరి సమస్య అన్నారు. తమతో కలిసి వచ్చే వారితో తాము పని చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అనడం లేదని, కానీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ జాతీయస్థాయిలో ఉండాలన్నారు.

కాగా, సీపీఐ కార్యాలయంలో ఈ రోజు ఉమ్మడి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. రేపు సీపీఐ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 27న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 27 తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటించవచ్చు.


More Telugu News