టీమ్ ఎంపిక నచ్చకపోతే మ్యాచ్‌లను చూడొద్దు: గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
- ఆసియా కప్‌నకు టీమ్ ఎంపికపై విమర్శలు
- విమర్శలతో వివాదాలు సృష్టించే బదులు జట్టుకు మద్దతివ్వాలన్న గవాస్కర్
- కొన్ని సార్లు జట్టులో సమతుల్యత ముఖ్యమని వ్యాఖ్య
వన్డే ప్రపంచకప్‌నకు కొన్ని రోజుల ముందు ఆసియా కప్‌ను టీమిండియా ఆడనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. అయితే జట్టులో కొందరికి స్థానం దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు.
ఓ మీడియా సంస్థతో గవాస్కర్ మాట్లాడుతూ.. విమర్శలతో వివాదాలు సృష్టించే బదులు జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించారు. టీమ్ ఎంపిక నచ్చకపోతే మ్యాచ్‌లను చూడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత మంది ఆటగాళ్లు అదృష్టవంతులే. కానీ జట్టు సెలక్షన్ జరిగిపోయింది. ఆశ్విన్ గురించి ఇక మాట్లాడొద్దు. వివాదాలు సృష్టించడం ఆపండి. ఇది మన జట్టు. మీకు ఎంపిక చేసిన టీమ్ నచ్చకపోతే.. మ్యాచ్‌లు చూడొద్దు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అతడిని తీసుకోండి.. ఇతడిని ఎందుకు తీసుకున్నారు? అనే చర్చ వద్దు. ఇది తప్పుడు ఆలోచనా ధోరణి” అని అన్నారు. చాహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపైనా గవాస్కర్ స్పందించారు. కొన్ని సార్లు జట్టులో సమతుల్యత ముఖ్యమని చెప్పారు. లోయర్ ఆర్డర్‌లో కుల్‌దీప్ బ్యాటింగ్ కూడా చేస్తాడని అన్నారు. చాహల్ కంటే కుల్‌దీప్ వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.