లిఫ్ట్ లో ఇరుక్కున్నా భయపడక తాపీగా హోంవర్క్ చేసిన హరియానా పిల్లాడు

  • ఫరీదాబాద్ లో రెండు గంటల పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయిన 8 ఏళ్ల బాలుడు
  • కేకలు వేసినా ఎవరూ సాయం రాలేదని వెల్లడి
  • ట్యూషన్ నుంచి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రుల వెతుకులాట
ప్రమాదవశాత్తూ మనం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే పడే టెన్షన్ అంతాఇంతా కాదు.. బయటపడేదాకా ఆందోళన వీడిపోదు. అలాంటిది ఎనిమిదేళ్ల బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కున్నా భయపడకుండా తాపీగా కూర్చుని హోంవర్క్ పూర్తిచేశాడు. హరియానాలోని ఫరీదాబాద్ లో ఆదివారం జరిగిందీ ఘటన. బాలుడి ధైర్యాన్ని ఆ అపార్ట్ మెంట్ వాసులతో పాటు స్థానికులు మెచ్చుకుంటున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
గ్రేటర్ ఫరీదాబాద్ లోని సెక్టార్ 86 లోని ఓ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో పవన్ చండీలా కుటుంబం నివసిస్తోంది. పవన్ చండీలా ఎనిమిదేళ్ల కొడుకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న టీచర్ దగ్గరికి రోజూ సాయంత్రం ట్యూషన్ కు వెళతాడు. రోజూలాగే ఆదివారం కూడా ట్యూషన్ కోసం వెళ్లేందుకు లిఫ్ట్ లోకి వెళ్లగా.. లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో డోర్ దగ్గర నిలబడి సాయం కోసం బాలుడు కేకలు వేశాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో బాలుడికి సాయం అందలేదు. కాసేపు ఎదురుచూసిన బాలుడు.. తర్వాత తన బ్యాగ్ ఓపెన్ చేసి తాపీగా హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు.

అలా దాదాపు రెండు గంటల పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయాడు. ఇంతలో ట్యూషన్ కని వెళ్లిన కొడుకు ఇంకా రాలేదేమని పవన్ చండీలా ఆరా తీయగా.. వాళ్ల అబ్బాయి ఆ రోజు అసలు ట్యూషన్ కే రాలేదని టీచర్ చెప్పారు. దీంతో ఆందోళన చెందిన పవన్.. కొడుకు కోసం చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు. అనుమానంతో లిఫ్ట్ తెరిపించి చూడగా.. లోపల హోంవర్క్ చేస్తూ కనిపించాడు. లిఫ్ట్ లో ఇరుక్కున్నా ఆందోళన లేకుండా హోంవర్క్ చేస్తున్న ఆ బాలుడి ధైర్యాన్ని అపార్ట్ మెంట్ వాసులు మెచ్చుకున్నారు.


More Telugu News