ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థిగా బడె నాగజ్యోతి.. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎంపిక

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై పోటీకి దించిన బీఆర్ఎస్ చీఫ్
  • నియోజకవర్గంలో రసవత్తరంగా మారిన ఎన్నికల పోరు
  • మాజీ నక్సలైట్ వర్సెస్ దివంగత నక్సలైట్ కుమార్తె
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సోమవారం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాలో ఓ క్యాండిడేట్ పేరుపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు తన పేరు ప్రకటించడం టీవీలో చూసి సదరు అభ్యర్థి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆమే.. ములుగు అభ్యర్థి బడె నాగజ్యోతి. అయితే, బడె నాగజ్యోతి ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీతక్క ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మాజీ నక్సలైట్, ప్రజల్లో ఆదరణ కలిగిన అభ్యర్థి కావడంతో సీతక్కపై బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో బడె నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరీ బడె నాగజ్యోతి..
గిరిజనులకు ఆప్తుడిగా పేరొందిన దివంగత నక్సలైట్ బడె నాగేశ్వర్ రావు కూతురే బడె నాగజ్యోతి.. ములుగు జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ(బోటనీ), బీఈడీని పూర్తి చేశారు. 2019లో మొదటిసారిగా సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌ (అప్పట్లో టీఆర్ఎస్)లో చేరారు. ఆపై తాడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ప్రస్తుతం బడే నాగజ్యోతి ములుగు జిల్లాలో జెడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, నాగజ్యోతి కుటుంబానికి బలమైన మావోయిస్టు నేపథ్యం ఉంది. ఆమె తండ్రి బడె నాగేశ్వర్ రావు 2018లో పోలీస్ ఎన్‌కౌంటర్ లో చనిపోయారు. మామ బడే చొక్కారావు అలియస్ దామోదార్ ప్రస్తుతం నిషేధిత మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


More Telugu News