మహిళల్లో మధుమేహం వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయట!

  • ప్రపంచంలో అత్యధికులను వేధిస్తున్న ఆరోగ్య సమస్య మధుమేహం
  • పురుషుల కంటే మహిళల్లో మధుమేహం కారణంగా హృద్రోగ సమస్యలు
  • జీవనశైలి మార్చుకోవడం, మెరుగైన ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని తిప్పికొట్టే చాన్స్
మధుమేహం పురుషులకూ వస్తుంది, మహిళలకూ వస్తుంది. ఇన్సులిన్ లో హెచ్చుతగ్గులు శరీర జీవక్రియలను దెబ్బతీసి, అవయవాల వైఫల్యం చెందేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా...? మధుమేహం కారణంగా ఉత్పన్నమయ్యే హృదయ సంబంధ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువట. 

భారతీయ సమాజానికి కుటుంబమే ప్రాతిపదిక. స్త్రీ, పురుషులు ఇరువురూ సంపాదిస్తున్నా... ఇంటిని నడిపించే బాధ్యత స్త్రీదే. చాలా సందర్భాలో మహిళలు ఇంట్లోని అందరి బాగోగుల గురించి పట్టించుకుంటూ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ముందే గుర్తించలేక, చాలా సులువుగా మధుమేహం బారినపడుతుంటారు. 

కొన్ని నివేదికల ప్రకారం 136 మిలియన్ల మంది భారతీయులు ఈ డయాబెటిస్ బారినపడే ముప్పు ఎదుర్కొంటున్నారట. అయితే వారందరూ ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే మధుమేహం నుంచి తప్పించుకోవచ్చు. 

అయితే, మహిళల్లో మధుమేహం వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నిపుణులు వెల్లడించారు. 

1. తరచుగా మూత్ర విసర్జన 

అధిక దాహం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం మధుమేహానికి సంకేతాలు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండడం వల్ల కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. అదనపు గ్లూకోజ్ ను వడపోయడానికి, గ్రహించడానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా, రాత్రివేళల్లో అత్యధిక సంఖ్యలో మూత్ర విసర్జన చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.

2. ఉన్నట్టుండి బరువు తగ్గడం

మధుమేహం ముప్పు ఉన్నవారు వేగంగా బరువు కోల్పోతుంటారు. మొదట్లో బరువు తగ్గడం బాగానే అనిపించినా, ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం మామూలు విషయం కాదని గుర్తించాలి. రక్తంలో పెరిగిపోయిన గ్లూకోజ్ కణాల్లో ప్రవేశించలేదు. దాంతో శరీర జీవక్రియలు మందగిస్తాయి. దాంతో, శరీరంలోని కండరాలు, కొవ్వు క్షీణత ప్రారంభమవుతుంది. దాంతో కొన్నిరోజుల్లోనే విపరీతంగా బరువు తగ్గిపోతారు.

3. విపరీతమైన ఆకలి

ఆహారపు అలవాట్లు బాగానే ఉన్నప్పటికీ, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారిలో విపరీతమైన ఆకలి ఉంటుంది. ఎంత తిన్నా ఆకలి తీరదు. ఇన్సులిన్ తగినంత మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల గ్లూకోజ్ ను శక్తిగా మార్చుకోవడంలో శరీరం విఫలమవుతుంది. అయితే, ఆకలి ఎక్కువగా వేయడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. అందుకే వైద్యుడ్ని సంప్రదించి, అది మధుమేహం కారణంగా కలుగుతున్న ఆకలో, కాదో నిర్ధారించుకోవాలి.

4. ఎంతకీ మానని గాయాలు

మీకు దెబ్బలు తగిలినప్పుడు, ఆ గాయాలు ఎంతకీ మానడంలేదా? అయితే అది మధుమేహానికి సంకేతం అయ్యుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వచ్చిందనడానికి ప్రధాన సూచనల్లో ఇదొకటి. డయాబెటిస్ వచ్చిన వారిలో రక్తనాళాలు మృదుత్వం కోల్పోయి, రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో గాయాలు మానేందుకు చాలా రోజులు పడుతుంది. అటు, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోవడంతో మధుమేహ రోగులు పలు ఇన్ఫెక్షన్ల బారినపడుతుంటారు. 

5. కొన్ని ఇతర లక్షణాలతోనూ మధుమేహాన్ని గుర్తించవచ్చు

పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా, మరికొన్ని ఇతర లక్షణాలతోనూ మధుమేహం రాకను పసిగట్టవచ్చు. అలసట, నీరసం, చూపు మందగించడం, చేతులు, పాదాల్లో తిమ్మిర్లు, మాట తడబడడం కూడా డయాబెటిస్ తో బాధపడేవారిలో కనిపించే లక్షణాలేని నిపుణులు వెల్లడించారు. రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తే డయాబెటిస్  బారినపడే ముప్పు తప్పించుకోవచ్చని వారు వివరిస్తున్నారు.


More Telugu News