హరీశ్ రావు క్లాస్ తీసుకున్నట్లుగా వార్తలు.. స్పందించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్
- తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
- హరీశ్‌రావు ఆయనకు ఫోన్ చేసి మందలించినట్లు ప్రచారం
- అదంతా పూర్తి అవాస్తవమన్న శ్రీనివాసరావు
- గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు ఇటీవల తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్తగూడెంలో ‘గడప గడపకు గడల’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కొత్తగూడెం నుంచి ఆయన పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాసరావును మంత్రి హరీశ్‌రావు మందలించినట్లు ప్రచారం జరిగింది. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి, రాజకీయ ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై డీహెచ్ క్లారిటీ ఇచ్చారు.
కొత్తగూడెంలో రాజకీయ ప్రకటనలు చేయొద్దని హరీశ్‌రావు తనకు సూచించారని, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారని జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని శ్రీనివాసరావు చెప్పారు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం తాను కొత్తగూడెంలోనే ఉన్నట్లు చెప్పారు.
కొత్తగూడెం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ‘గడప గడపకు గడల’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు. గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.