వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలు: పురందేశ్వరి ఆరోపణలు
- అవకతవకలకు పాల్పడిన ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారన్న పురందేశ్వరి
- ఓటర్ల జాబితాను పర్యవేక్షించేందుకు స్థానికంగా కమిటీలు వేయాలని డిమాండ్
- అవకతవకలకు పాల్పడేందుకు హైదరాబాద్ లో వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణ
ఏపీ ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను తొలగించడం వంటివి జరుగుతున్నాయని మండిపడ్డారు. ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇచ్చిన ఫిర్యాదుతో వీరిని సస్పెండ్ చేశారని తెలిపారు. ఓటర్ల జాబితాను పర్యవేక్షించేందుకు స్థానికంగా కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలలో చేర్పులు, తీసివేతలు జరుగుతున్నాయని చెప్పారు. వాలంటీర్లు పంపుతున్న సమాచారాన్ని క్రోడీకరించి, అవకతవకలకు పాల్పడేందుకు హైదరాబాద్ లో వైసీపీ ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాల పట్ల బీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.