రింకూ సింగ్ వచ్చాడు... భారత్ కు భారీ స్కోరు వచ్చేలా బాదాడు!

  • డబ్లిన్ లో టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండో టీ20
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఐర్లాండ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసిన భారత్
  • 21 బంతుల్లో 38 పరుగులు చేసిన రింకూ
  • 2 ఫోర్లు, 3 సిక్సులతో వీరబాదుడు
  • చివరి 5 ఓవర్లలో 56 పరుగులు  సాధించిన భారత్
ఐపీఎల్ లో సంచలన ఇన్నింగ్స్ లతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ బ్యాట్స్ మన్ రింకూ సింగ్ ఇవాళ ఐర్లాండ్ తో రెండో టీ20 మ్యాచ్ లో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేశాడు. 

ఓ దశలో 17 ఓవర్లలో 4 వికెట్లకు 137 పరుగుల స్కోరుతో ఉన్న టీమిండియా... 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లకు 185 పరుగుల భారీ స్కోరు సాధించిందంటే అందుకు కారణం రింకూ దూకుడే. మరో ఎండ్ లో శివం దూబే కూడా చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో భారత్ కు 56 పరుగులు లభించాయి. దూబే 16 బంతుల్లో 2 సిక్సులతో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

అంతకుముందు, టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 పరుగులు చేసి అవుట్  కాగా... రుతురాజ్ గైక్వాడ్ అర్ధసెంచరీతో సత్తా చాటాడు. గైక్వాడ్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 58 పరుగులు చేశాడు. 

తిలక్ వర్మ వరుసగా రెండో మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. తొలి టీ20లో డకౌట్ గా వెనుదిరిగిన ఈ తెలుగు బ్యాట్స్ మన్ ఇవాళ్టి మ్యాచ్ లో 1 పరుగు చేసి అవుటయ్యాడు. ఇక, అనేక అవకాశాలు ఇస్తున్నా అందిపుచ్చుకోని సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో రాణించాడు. శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 40 పరుగులు చేశాడు.


More Telugu News