పయ్యావుల కేశవ్ ఫిర్యాదు ఫలితం... ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు

  • నకిలీ ఓట్లు చేర్చుతున్నారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదులు
  • ఉరవకొండ అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల
  • ఓట్ల ప్రక్రియను పరిశీలించిన సీఈసీ అధికారులు
  • రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు
  • సీఈసీ ఆదేశాలతో భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఏపీలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్చే కార్యక్రమం జరుగుతోందని, కట్టడి చేయాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి పలు విజ్ఞప్తులు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 

ఆయన ఫిర్యాదు ఫలితంగా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీఈసీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ జీవో జారీ చేసింది. 

6 వేల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు, పెద్ద ఎత్తున ఓట్లు తొలగించడంపై పయ్యావుల కేశవ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారులు ఉరవకొండలో ఓట్ల ప్రక్రియను పరిశీలించారు. ఓట్ల అవకతవకల్లో రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని నిర్ధారించారు.

దాంతో, భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సీఈసీ రాష్ట్ర సీఎస్ ను ఆదేశించింది. ఆ ఆదేశాలను పెండింగ్ లో ఉంచడంతో ఎన్నికల సంఘం మరోసారి ఆదేశాలు ఇచ్చింది. చివరకు భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News