ఆయన మిత్రులకు.. ఈయన కుటుంబానికి దోచిపెడుతున్నారు: రేవంత్ రెడ్డి
- బీఆర్ఎస్, బీజేపీ అభివక్త కవలలన్న రేవంత్ రెడ్డి
- రెండు పార్టీలు నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని విమర్శ
- బీజేపీది విభజించు– పాలించు విధానమని మండిపాటు
బీజేపీ, బీఆర్ఎస్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ సంపదను తన మిత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ దోచిపెడుతుంటే.. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ అభివక్త కవలలని, నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని సోమాజిగూడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్. కానీ బ్రిటీష్ పాలకుల మాదిరి విభజించు– పాలించు విధానాన్ని అమలు చేస్తున్న చరిత్ర బీజేపీది. అందుకు మణిపూర్ సంఘటనే నిదర్శనం. అసెంబ్లీలో మణిపూర్ అంశంపై బీఆర్ఎస్ కనీసం మాట్లాడలేదు” అని విమర్శించారు. కానీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కాంగ్రెస్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.