బాంబు పెట్టానంటూ ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తిరుమల పోలీసులు

  • మధ్యాహ్నం మూడు గంటలకు పేలుతుందని 15న ఉదయం 11.25 గంటలకు ఫోన్
  • అణువణువు గాలించిన పోలీసులు
  • ఫేక్ కాల్ అని నిర్ధారణ
  • నిందితుడిని సేలంకు చెందిన బాలాజీగా గుర్తింపు
  • అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు
బాంబు పేల్చి భక్తులను చంపేస్తానంటూ తిరుమల కంట్రోల్ రూముకు ఫోన్ చేసి బెదిరించిన తమిళనాడు భక్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సేలంకు చెందిన బి.బాలాజీ(39)గా గుర్తించారు. ఆగస్టు 15న ఉదయం దాదాపు 11.25 గంటల సమయంలో అలిపిరిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్ రూముకు తన మొబైల్ నుంచి ఫోన్ చేసి బాంబు పెట్టానని, అది మూడు గంటలకు పేలుతుందని బెదిరించాడు. బాంబు పేలితే కనీసం 100 మంది చనిపోతారని చెప్పాడు. 

ఫోన్ కాల్ అందుకున్న వెంటనే పోలీసులు పరుగులుపెట్టారు. అలిపిరి చెక్‌పోస్టులో బాంబుకోసం అణువణువు గాలించారు. అయితే, బాంబు ఎక్కడా కనిపించకపోవడంతో ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బాలాజీని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఫోన్ కాల్ చేసింది తానేనని నిందితుడు నిన్న అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News