సోదరుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం.. వేలు నరుక్కున్న వ్యక్తి.. వీడియో ఇదిగో!

  • మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో వెలుగు చూసిన ఘటన
  • తన సోదరుడు, అతడి భార్య ఆత్మహత్యతో కుంగిపోయిన వ్యక్తి
  • కొందరి వేధింపులు భరించలేకే వారు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ ఆరోపణ
  • పోలీసుల దర్యాప్తులో పురోగతి లేని కారణంగా ఆగ్రహం 
  • పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారం చేతి వేలు నరుక్కున్న వైనం, ఘటనను రికార్డింగ్
  • విషయం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో దర్యాప్తునకు ఆదేశం
తన సోదరుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లిప్తతకు నిరసనగా మహారాష్ట్రలోని ఓ వ్యక్తి ఏకంగా తన వేలునే నరుక్కున్నాడు. అంతేకాకుండా, ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తనకు న్యాయం జరిగే వరకూ ఇలా రోజుకో అవయవాన్ని నరుక్కుని ముఖ్యమంత్రికి పంపిస్తానని వీడియోలో వెల్లడించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగడంతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. 

ఫల్టన్‌కు చెందిన ధనుంజయ్ నానావరే శుక్రవారం ఉదయం ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆగస్టు 1న ఆయన సోదరుడు నందకుమార్ నానావరే, ఆయన భార్య ఉర్మిళ ఒకరి తరువాత మరొకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుమునుపు వారు తమ మరణానికి కారణమైన వ్యక్తుల పేర్లు చెబుతూ ఓ వీడియో కూడా రికార్డు చేశారు. మొత్తం తొమ్మిది మందిని తమ వీడియోలో ప్రస్తావించారు. ఉల్హాస్‌నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ముందస్తుబెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

కాగా విషయం వైరల్‌ కావడంతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. బాధితుడికి అతడి వేలు తిరిగి అతికించేలా రికన్‌స్ట్రక్షన్ సర్జరీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బాధితుడి కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి 100 కిలోమీటర్ల దూరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడి వేలు తిరిగి అతికించడం సాధ్యపడదని వైద్యులు నిర్ధారించారు. 

కాగా, తన సోదరుడు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నాడని ధనుంజయ్ నానవరే ఆరోపించారు. ఘటనకు ముందు రోజు ధునుంజయ్ ఓ వ్యక్తికి ఏకంగా రూ.10 లక్షలు ట్రాన్సఫర్ చేసినట్టు కూడా గుర్తించానని చెప్పుకొచ్చాడు. ఆత్మహత్యకు మునుపు ధనుంజయ్ రికార్డు చేసిన వీడియోలో సంగ్రామ్ నికల్జే, అడ్వకేట్ నితిన్ దేశ్‌ముఖ్, గణపతి కాంబ్లే, రంజిత్ సింగ్ నాయక్ నింబాల్కర్ పేర్లు ప్రస్తావించారు. తన సోదరుడికి పొరుగింటి వారితో ఉన్న కోర్టు కేసులను సెటిల్ చేసుకోవద్దంటూ దేశ్‌ముఖ్ తనకున్న పరిచయాల ద్వారా ఒత్తిడి తెచ్చాడని కూడా వెల్లడించారు. 

నిందితులు పలుమార్లు తన సోదరుడి ఇంటికి వచ్చి వెళ్లినట్టు కూడా స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన విషయాన్ని కూడా ధనుంజయ్ ప్రస్తావించారు. ‘‘మోదీ ప్రభుత్వానికి ఓటేసిన వేలునే నేను తొలగించుకుని సర్కారు బహుమతిగా పంపిస్తున్నా. ఫడ్నవీస్ అధికారంలో ఉండగానే ఇదెలా సాధ్యమైందో నాకు అస్సలు అర్థం కావట్లేదు’’ అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధిత కుటుంబానికి నిందితులతో కొన్ని భూ లావాదేవీల సమస్యలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్రఏమిటో తేల్చేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News