అభ్యంతరకర పోస్టు పెట్టి సారీ చెప్పేస్తే సరిపోదు.. పర్యవసానం ఎదుర్కోవాల్సిందే!: సుప్రీంకోర్టు

  • సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న కోర్టు
  • పోస్టుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తెరగాలని సూచన
  • తమిళనాడు మాజీ ఎమ్మెల్యే పిటిషన్ పై వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినపుడు దాని పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోస్టు పెట్టిన తర్వాత తప్పయిపోయిందంటూ సారీ చెబితే కుదరదని, క్రిమినల్ కేసులను తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో పెట్టే ప్రతీ పోస్టు ఎక్కడిదాకా పోతుంది.. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది గుర్తెరిగి ప్రవర్తించాలని, జాగ్రత్తగా మసలుకోవాలని హితవు పలికింది. ఈమేరకు తమిళనాడు మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఫేస్ బుక్ లో కనిపించిన ఓ అభ్యంతరకర పోస్టును తమిళనాడు మాజీ ఎమ్మెల్యే శేఖర్ షేర్ చేశారు. దీనిపై సదరు జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శేఖర్ పై చెన్నై కమిషనరేట్ లో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే శేఖర్ చెన్నై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన హైకోర్టు.. శేఖర్ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో శేఖర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

2018 ఏప్రిల్ 20న తన క్లయింట్ కళ్లలో మందు వేసుకోవడం వల్ల ఫేస్ బుక్ లో కనిపించిన పోస్టును సరిగా చదవకుండానే షేర్ చేశాడని శేఖర్ తరఫు లాయర్ వాదించారు. అయితే, ఆ పోస్టులోని అభ్యంతరకర వ్యాఖ్యల గురించి తెలిసిన వెంటనే.. అంటే పోస్టు షేర్ చేసిన రెండు గంటల్లోనే దానిని తొలగించారని చెప్పారు. బాధితురాలికి, జర్నలిస్టు సంఘాలకు క్షమాపణ కూడా చెప్పారని వివరించారు. సరిగా చూడకుండా చేసిన పొరపాటు కాబట్టి తన క్లయింట్ పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త అవసరమని, పోస్టు పెట్టేసి సారీ చెబితే సరిపోదని స్పష్టం చేసింది. పోస్టు పెట్టిన తర్వాత దాని పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందేనని చెబుతూ మాజీ ఎమ్మెల్యే పిటిషన్ ను తోసిపుచ్చింది.


More Telugu News