నుహ్ లాంటి ఘటనలే ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉంది.. దిగ్విజయ్‌సింగ్ అనుమానం

  • ‘విధిక్ విమర్శ్ 2023’లో పాల్గొన్న దిగ్విజయ్
  • మధ్యప్రదేశ్‌లో గెలవడం కష్టమన్న సంగతి బీజేపీకి తెలుసన్న కాంగ్రెస్ నేత
  • రాష్ట్రంలోని ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందన్న మాజీ సీఎం కమల్‌నాథ్
హర్యానాలోని నుహ్‌లో ఇటీవల జరిగిన మత కలహాల్లాంటివే ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లోనూ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని బీజేపీ భావిస్తోందని, కాబట్టి నుహ్ లాంటి ఘటనలను కొట్టిపడేయలేమని పేర్కొన్నారు. కాంగ్రెస్ లీగల్, మానవ హక్కుల సెల్‌ ఆధ్వర్యంలో లాయర్లు నిర్వహించిన ‘విధిక్ విమర్శ్ 2023’లో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తమపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్న విషయం మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీకి తెలుసని, అందుకనే ఎన్నికలకు ముందు రాష్ట్రంలోనూ నుహ్‌లాంటి అల్లర్లను రేకెత్తించే అవకాశం ఉందని ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో రాజ్యసభ సభ్యుడు వివేక్ టంకా.. వేలాదిమంది న్యాయవాదులు కాంగ్రెస్‌కు అండగా నిలిచేలా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని అన్నారు. 

మళ్లీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఇక్కడ సమావేశమయ్యారని, వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ.. పంచాయతీల నుంచి సచివాలయం వరకు అన్ని స్థాయుల్లోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు.


More Telugu News