న్యూజిలాండ్‌కు భారీ షాకిచ్చిన పసికూన యూఏఈ

  • కివీస్‌పై తొలి విజయాన్ని నమోదు చేసిన యూఏఈ
  • రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం
  • దుబాయ్‌లోనూ ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు
న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ కోలుకోలేని షాకిచ్చింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కివీస్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం. అంతేకాదు, దుబాయ్‌లోనూ ఆ జట్టు గెలవడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. చాప్‌మన్ 63 పరుగులతో టాప్  స్కోరర్‌గా నిలవగా బోవెస్, నీషమ్ చెరో 21 పరుగులు చేశారు. అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూఈఏ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ముహమ్మద్ వాసిమ్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. వృత్య అరవింద్ 25, అసిఫ్ ఖాన్ 48, బాసిల్ అహ్మద్ 12 పరుగులు చేశారు. మూడు వికెట్లు పడగొట్టిన యూఈఏ బౌలర్ ఆయన్ అఫ్జల్ ఖాన్ ‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News