ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? అంటే కేంద్రమంత్రి సమాధానం ఇదీ

  • ఎన్నికలకు ముందే చమురు ధరలు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని వ్యాఖ్య
  • అదంతా మీడియా చేసిన ప్రచారమేనన్న కేంద్రమంత్రి
  • కరోనా సమయంలో చమురు ధరలు పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని వెల్లడి
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తుందనడం అపోహ మాత్రమేనని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఆజ్ తక్ జీ20 సమ్మిట్‌లో పూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇంధన ధరలను తగ్గిస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అదంతా మీడియా చేసిన ప్రచారమే అన్నారు. ఇంధన ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కానీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.

అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా ఖర్చులు, రిఫైనింగ్ వ్యయం, పన్నులు వంటి అనేక అంశాలు ఇంధన ధరలను నిర్దేశిస్తాయన్నారు. ఇలాంటి అంశాలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపైనే ఇంధన ధరలు ఆధారపడి ఉంటాయన్నారు. మహమ్మారి అనంతరం 2022లో చమురు ధరలు పెరిగిన సమయంలో ధరలు తగ్గించాలని చమురు సరఫరా చేసే దేశాలను కోరడానికి బదులుగా, ఎక్సైజ్ పన్ను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించామన్నారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించిందన్నారు. తద్వారా ధరలు రూ.8 నుండి రూ.11కు తగ్గాయన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A.లో ఎందుకు భాగస్వామి అయ్యారో చెప్పాలని నిలదీశారు.


More Telugu News