తిరుమల నడకదారుల్లో విక్రేతలకు టీటీడీ తాజా మార్గదర్శకాలు

  • ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి
  • తిరుమల నడకమార్గానికి సమీపంలో విగతజీవురాలిగా బాలిక
  • జంతువుల సంచారాన్ని కట్టడి చేసేందుకు టీటీడీ చర్యలు
  • నడకమార్గాల్లో పండ్లు, కూరగాయలు విక్రయించడంపై ఆంక్షలు
ఇటీవల తిరుమల నడకదారిలో లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి అటవీశాఖ, పోలీస్, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నడకమార్గాలకు సమీపంలోకి వన్యప్రాణులు రాకుండా ఏంచేయాలన్నదానిపై సూచనలు, సలహాలు స్వీకరించారు. 

ఈ క్రమంలో అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో విక్రయదారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, అలిపిరి నడకమార్గంలోనే 100కి పైగా ఆహార పదార్థాలు, తినుబండారాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయని, వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని స్పష్టం చేశారు. 

భక్తులు ఈ పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి జింకలు, దుప్పులు వంటి సాధు జంతువులకు తినిపిస్తుండడం వల్ల... నడకమార్గాలకు సమీపంలో వన్యప్రాణుల సంచారం అధికమైందని ధర్మారెడ్డి వివరించారు. ఆయా జంతువుల కోసం క్రూరమృగాలు నడకదారులకు చేరువలోకి వస్తున్నాయని, భక్తులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. 

నడకదారుల్లో ఇకపై పూర్తిస్థాయిలో సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు.


More Telugu News