తిరుమల నడకమార్గంలో చిరుతల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
- చిన్నారిని చిరుత పొట్టన పెట్టుకున్న ఘటన బాధాకరమన్న పెద్దిరెడ్డి
- మ్యాన్ ఈటర్ గా మారిన రెండు చిరుతలను జూ పార్క్ లో ఉంచుతామని వెల్లడి
- కంచెను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు టీటీడీ, అటవీశాఖ యోచిస్తున్నాయన్న మంత్రి
తిరుమల నడకదారిలో చిరుతలు భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరుతల నుంచి రక్షించుకునేందుకు భక్తులకు టీటీడీ కర్రలను కూడా అందజేస్తోంది. మరోవైపు ఈ అంశంపై అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారిని చిరుత పొట్టనపెట్టుకున్న ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించామని వెల్లడించారు. భక్తులపై చిరుతలు దాడి చేయకుండా పటిష్ఠ చర్యలను తీసుకుంటామని చెప్పారు. రెండు చిరుతలు మ్యాన్ ఈటర్ గా మారాయని, వాటిని జూ పార్క్ లో ఉంచుతామని తెలిపారు. నడకమార్గంలో శాశ్వత ప్రాతిపదికన కంచెను ఏర్పాటు చేసేందుకు టీటీడీ, అటవీశాఖలు యోచిస్తున్నాయని చెప్పారు. టీటీడీ పరిధిలోని అటవీప్రాంతంలో సంఘటన జరిగిందని... టీటీడీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.