జైస్వాల్, గైక్వాడ్ సమన్వయ లోపం.. ఇద్దరూ ఒకే వైపు.. అయినా నాట్ అవుట్.. వీడియో ఇదిగో

  • మొదటి టీ20 రెండో ఓవర్లో చోటు చేసుకున్న దృశ్యం
  • సగం దూరమే పరుగెత్తి వెనక్కి వెళ్లిపోయిన గైక్వాడ్
  • ఆ తర్వాత అర్థం చేసుకుని మళ్లీ పరుగో పరుగు
  • ఐర్లాండ్ బౌలర్లు బాల్ ను త్రో చేసినా పడని వికెట్
ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అదృష్టవశాత్తూ వారు అవుట్ కాకపోవడం భారత జట్టు విజయంలో కీలక మలుపు అని చెప్పుకోవాల్సిందే. మరోవైపు ఐర్లాండ్ వైపు ఫీల్డింగ్ లోపం కూడా స్పష్టమైంది. నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోగా, డక్ వర్త్ లూయిస్ విధానంలో విజయ లక్ష్యాన్ని కుదించడం, భారత్ సునాయాసంగా గెలవడం తెలిసిందే.

రెండో ఓవర్ లో మూడో బంతిని జోష్ లిటిల్ సంధించాడు. బాల్ జైస్వాల్ థైప్యాడ్ ను తాకి లెగ్ సైడ్ వెళ్లింది. గైక్వాడ్ రన్ కోసం ముందుకు వచ్చాడు. దీంతో జైస్వాల్ కూడా ఆగకుండా పిచ్ లో మరో ఎండ్ వైపు వచ్చేశాడు. కానీ, గైక్వాడ్ ముందుకు వెళ్లిపోలేదు. సగం దూరం ముందుకు పరుగెత్తి అవుట్ అవుతాననే భయంతో వెనక్కి వచ్చేశాడు. దీంతో పిచ్ కు ఒకేవైపు ఇద్దరు బ్యాటర్లు చేరుకోవడంతో ప్రేక్షకుల్లో నవ్వులు ఆగలేదు. గైక్వాడ్ మళ్లీ వెంటనే చురుగ్గా పరుగెత్తి తన స్థానానికి వెళ్లిపోవడం, ఈ మధ్యలో వికెట్లను పడగొట్టేందుకు ఐర్లాండ్ ఫీల్డర్లు చేసిన త్రోలు పనిచేయకపోవడం కలిసొచ్చాయి. నిన్నటి 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇద్దరు ఓపెనర్లే కీలక పాత్ర పోషించారు. జైస్వాల్ 24 పరుగులు, గైక్వాడ్ 19 పరుగులు సాధించారు.


More Telugu News