మూడు రోజులు ఆఫీస్ కు రాకపోతే.. శాశ్వతంగా ఇంటికే: ఉద్యోగులకు మెటా హెచ్చరిక

  • సెప్టెంబర్ 5 నుంచి కొత్త నిబంధన అమల్లోకి
  • పాటించని వారిపై స్థానిక చట్టాల కింద చర్యలు
  • రేటింగ్ తగ్గించడంతోపాటు, అవసరమైతే తొలగిస్తామని హెచ్చరిక
మార్క్ జుకెర్ బర్గ్ ఆధ్వర్యంలోని మెటా (ఫేస్ బుక్) తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నూతన నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందంటూ సీరియస్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారంలో విధిగా మూడు రోజులు రావాలంటూ మానవ వనరుల విభాగం హెడ్ లోరి గోలర్ ఆదేశించారు. తమ తాజా నిర్ణయం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్ వర్క్ ను ప్రోత్సహించేందుకేనని ఆమె తెలిపారు.

తమ టీమ్ సభ్యులు ఈ సూచనను విధిగా పాటిస్తున్నదీ, లేనిదీ మేనేజర్లు తనిఖీ చేయాలని మెటా కోరింది. ఆదేశాలను పాటించని వారిపై స్థానిక చట్టాల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెటా ఉద్యోగులకు ఇదే నిబంధన వర్తించనుంది. తరచుగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, ఉద్యోగుల పనితీరు రేటింగ్ తగ్గించడంతోపాటు, మరీ తీవ్రమనిపిస్తే తొలగించడం జరుగుతుందని స్పష్టం చేసింది.


More Telugu News