50 కోట్లు దాటిన జన్ ధన్ ఖాతాలు

  • అందులో 56 శాతం మహిళలవేనన్న కేంద్రం
  • రూపే డెబిట్ కార్డుతో రూ.2 లక్షల ప్రమాద బీమా
  • రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం
దేశంలోని నిరుపేదలు కూడా బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం తీసుకొచ్చింది. 2014లో తీసుకొచ్చిన ఈ పథకం కింద అన్ని బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే సదుపాయం కల్పించింది. ఈ ఖాతా తెరిచిన వారికి రూపే కార్డులను అందించి, వాటిపై రూ.2 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. అంతేకాదు.. ఖాతాదారులకు రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించింది. ప్రస్తుతం ఈ ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

50 కోట్లకు చేరిన జన్ ధన్ ఖాతాల్లో 56 శాతం మహిళలవేనని, ఇందులో 67 శాతం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలవేనని కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్ ఉందని వెల్లడించింది. సగటున ఒక్కో ఖాతాలో రూ.4,076 ఉన్నట్లు తెలిపింది. ఈ ఖాతాదారులలో 34 కోట్ల మందికి రూపే కార్డులను అందించామని, వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించామని పేర్కొంది. జన్ ధన్ ఖాతాదారులలో 5.5 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది.


More Telugu News