అతడు మరో ధోనీ అవుతాడు: కిరణ్ మోరే

  • నంబర్ 5,6లో గొప్పగా ఆడగలడన్న అభిప్రాయం
  • రింకూ మంచి ఫినిషింగ్ ఇస్తాడన్న మాజీ వికెట్ కీపర్
  • తిలక్ వర్మ్ కూడా ఫినిషర్ పాత్ర పోషించగలడని వెల్లడి
ఈ నెల చివర్లో ఆసియా కప్ మొదలు కాబోతోంది. అక్టోబర్ నుంచి వన్డే ప్రపంచకప్ పోరు ప్రారంభం కానుంది. టీమిండియాకు ఈ రెండు ఎంతో ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రస్తుతం భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ యువ క్రికెటర్ రింకూ సింగ్ కు సైతం తొలిసారి టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. దీనిపై అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడనే విషయం తెలిసిందే. 

రింకూ సింగ్ ప్రతిభపై ఎందరో క్రికెటర్లు ఇప్పటికే స్పందించారు. ఐర్లాండ్ సిరీస్ లో రింకూసింగ్ తన సత్తా చాటితే భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని తెలుస్తోంది. 2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ చెలరేగి ఆడడం ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ లో అవకాశం దక్కించుకున్న రింకూ సింగ్ కు టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే సైతం మద్దతు పలికారు. ధోనీ మాదిరే భారత జట్టుకు రింకూ గొప్ప ఫినిషర్ అవుతాడన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘భారత జట్టులో అతడికి (రింకూసింగ్) అవకాశం కోసం వేచి చూస్తున్నాను. నంబర్ 5, 6లో అతడు గొప్పగా ఆడి, అద్భుతమైన ముగింపు ఇవ్వగలడు. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ను కూడా ఈ స్థానాల్లో చూశాం. వారిలాంటి ఆటగాడు మళ్లీ లభించాడు. తిలక్ వర్మ కూడా ఫినిషర్ పాత్ర పోషించగలడు. రింకూ గొప్ప ఫీల్డర్ కూడా’’ అని కిరణ్ మోరే తన అభిప్రాయాలను జియోసినిమాతో పంచుకున్నారు.


More Telugu News