కోట్లు సంపాదిస్తున్నా రైతుగా ఎందుకు మారాడో చెప్పిన ధోనీ

  • రాంచీలో 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్న ధోనీ
  • కరోనా సమయంలో పూర్తి స్థాయిలో రైతుగా మారిన మిస్టర్ కూల్
  • చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేయడాన్ని చూశానన్న ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్ గానే కాకుండా బిజినెస్ మేన్ గా, సినిమా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఒక క్వాలిఫైడ్ పారాట్రూపర్ కూడా. అంతేకాదు ధోనీకి వ్యవసాయం అన్నా చాలా మక్కువ ఉంది. 2020లో ఆయన ఫుల్ టైమ్ రైతుగా మారాడు. ఇప్పుడు తన హోమ్ టౌన్ రాంచీలో దాదాపు 40 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే కోట్లాది రూపాయల సంపాదన ఉన్న ధోనీ ఒక్కసారిగా రైతుగా ఎందుకు మారాడనే సందేహం చాలా మందికి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనికి ధోనీ సమాధానం చెప్పాడు. 

తాను ఒక చిన్న టౌన్ నుంచి వచ్చానని, అప్పటి నుంచే వ్యవసాయం చేయడాన్ని తాను చూశానని ధోనీ చెప్పాడు. వ్యవసాయం తమకు కొత్తేమీ కాదని తెలిపాడు. కోవిడ్ కు ముందే తాము వ్యవసాయం చేయడాన్ని ప్రారంభించామని చెప్పాడు. తమకున్న 40 ఎకరాల భూమిలోని 5 ఎకరాల్లో వ్యవసాయం చేసేవారమని తెలిపాడు. కరోనా సమయంలో తనకు పూర్తిగా ఫ్రీటైమ్ దొరికిందని... దీంతో, పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయడానికి ఇదే సరైన సమయమని భావించి మొత్తం 40 ఎకరాల్లో వ్యవసాయం చేశామని చెప్పారు.


More Telugu News