బుమ్రాకు కెప్టెన్సీ వద్దంటున్న భారత మాజీ క్రికెటర్

  • 11 నెలల తర్వాత పునరాగమనం చేసిన స్టార్ పేసర్
  • ఐర్లాండ్ తో సిరీస్‌లో కెప్టెన్ గా తొలి విజయం అందుకున్న బుమ్రా
  • బౌలర్‌‌గా అతని సేవలు జట్టుకు అవసరం అంటున్న అభిషేక్ నాయర్
టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్సీని అప్పగించాలనే ఆలోచన విరమించుకోవాలని భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. భారత్ జట్టుకు అతని నాయకత్వ నైపుణ్యం కంటే ఫాస్ట్ బౌలర్ అవసరం ఎక్కువ అని చెప్పాడు. ఐర్లాండ్‌లో నిన్న రాత్రి వర్షప్రభావిత తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. గాయం నుంచి కోలుకొని 11 నెలల తర్వాత పునరాగమనం చేసిన బుమ్రా ఈ సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. నాయకుడిగా తన మ్యాచ్ లోనే రెండు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలిచాడు.

ఈ విజయం తర్వాత బుమ్రాను భవిష్యత్ పూర్తికాల కెప్టెన్‌ చేయాలన్న ఆలోచనను మాజీ కీపర్ కిరణ్ మోరే సమర్థించాడు. కానీ, అభిషేక్ నాయర్ ఈ ఆలోచనను తప్పుబట్టాడు. బుమ్రా తన బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, స్టార్ పేసర్‌పై ఎక్కువ భారం మోపడం జట్టుకు మంచిది కాదని నాయర్ అంటున్నాడు. గతంలో ఇంగ్లండ్ తో టెస్టులో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన సందర్భంలో బుమ్రాకు పని భారం ఎక్కువైందన్నాడు. అతని వెన్ను గాయం తిరిగబెట్టడానికి అది కూడా ఓ కారణం కావొచ్చని నాయర్ అభిప్రాయపడ్డాడు. మున్ముందు ముఖ్యమైన టోర్నీల్లో జట్టు అవసరాల కోసం బుమ్రాను గాయాల పాలవకుండా కాపాడుకోవాలని సూచించాడు.


More Telugu News