చురుగ్గానే అల్పపీడనం.. నేడు, రేపు కూడా తెలంగాణలో భారీ వానలు

  • వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎస్ శాంతికుమారి
  • కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశం
  • నిన్న అత్యధికంగా ఆళ్లపల్లిలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉంది. మరో రెండుమూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గడ్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిన్న కూడా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యల్పంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.


More Telugu News