కేసులు మాఫీ చేసే వారి కోసం ఎంపీ సీట్లు అమ్ముకున్నారు: చంద్రబాబు

  • కోనసీమ జిల్లాలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పర్యటన
  • అమలాపురంలో చంద్రబాబు భారీ బహిరంగ సభ
  • దేశంలోనే ధనిక సీఎం ఈ సైకో జగన్ అంటూ వ్యాఖ్యలు
  • ఈసారి గెలిస్తే ప్రజల గోచీ కూడా మిగల్చడని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా అమలాపురం విచ్చేశారు. ఇక్కడి గడియారం స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రసంగిస్తూ... సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో చీకటిపాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతి రోజూ ప్రజలను దోచుకోవడమేనని పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే పోరాటం అంట...  అబ్బ... ఎంత ఆరాటం అయ్యా ఈయనకు! అంటూ వ్యాఖ్యానించారు. పేదల రక్తాన్ని తాగే జలగ... ఈ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదవాళ్లను దోచేశాడు... ఇక మిగిలింది మీ గోచీ మాత్రమే... రేపు మళ్లీ ఇతనే వస్తే మనకు గోచీ కూడా మిగలదు అని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో విద్యుత్ కోతలతో దోమల బెడద ఎక్కువైందన్నారు. రాని విద్యుత్ కు కూడా చార్జీల పేరుతో భారం మోపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి సీఎం నిర్ణయాల వల్ల ప్రజలపై భారం పడిందని, ప్రజల్లో అప్పులేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచబోనని, అవసరమైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు ప్రకటించారు. 

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...

  • దేశంలోనే ధనిక సీఎం ఈ సైకో జగన్ రెడ్డి.
  • కేసులు మాఫీ చేసేవారి కోసం ఎంపీ సీట్లు అమ్ముకున్నారు. కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి, మెడలు దించారు.
  • పోలవరం నిధుల గురించి జగన్ ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. 
  • విభజన హామీలు కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వచ్చాయా? కేంద్రం మంజూరు చేసే ఒక్క విద్యాసంస్థ అయినా ఏర్పాటు చేశారా?
  • పార్లమెంటులో ఒక్క రోజైనా ప్రజల సమస్యలను ప్రస్తావించారా?
  • బాబాయ్ హత్యలో తమ్ముడ్ని కాపాడుకునేందుకు జగన్ యత్నిస్తున్నారు.
  • హత్యా రాజకీయాలు నాకు చేతకాదు... అవి నా వారసత్వం కాదు.
  • పవన్ నిజాలు మాట్లాడితే ఆయనపైనా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాస్తే మీడియాపై దాడులు చేస్తున్నారు.
  • ఎవరూ వాస్తవాలు చెప్పకూడదని జగన్ భావిస్తున్నారు. నేను జగన్ మాదిరి మోసం చేయను... చెప్పింది చేస్తా.
  • భవిష్యత్తు గ్యారెంటీ... బాబు ష్యూరిటీ... ఇదే నా నినాదం. ఇక వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరు. వైసీపీకి ఎక్స్ పైరీ డేటు వచ్చేసింది.
  • ఈసారి జన సునామీతో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం.  





More Telugu News