రాజ్యసభలో బిలియనీర్లు: తెలంగాణ నుండి ముగ్గురు, ఏపీ నుండి ఐదుగురు

  • 18 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ.9,419 కోట్లు
  • తెలంగాణ రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు
  • ఏపీ రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లు
తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీలలో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ మేరకు ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు సంస్థలు వెల్లడించాయి. పద్దెనిమిది మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. 225 మంది రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదికను విడుదల చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ నుండి పద్దెనిమిది మంది ఎంపీలు ఉండగా, వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.9,419 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం రాజ్యసభ సభ్యులలో ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం పదకొండు మంది ఎంపీలలో ఐదుగురు, తెలంగాణ నుండి ఏడుగురు ఎంపీలలో ముగ్గురు, మహారాష్ట్ర నుండి 19 మంది ఎంపీలలో ముగ్గురు, ఢిల్లీ నుండి ముగ్గురు ఎంపీలలో ఒకరు, పంజాబ్ నుండి ఏడుగురు ఎంపీలలో ఇద్దరు, హర్యానా నుండి ఐదుగురు ఎంపీలలో ఒకరు, మధ్యప్రదేశ్ నుండి పదకొండు మంది ఎంపీలలో ఇద్దరు తమ ఆస్తులను రూ.100 కోట్లుగా ప్రకటించారు.

తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడుగురు ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు, ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లుగా ఉంది. యూపీకి చెందిన 30 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.1,941 కోట్లుగా ఉంది.

225 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే 41 మంది సిట్టింగ్ రాజ్యసభ సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండగా, ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు నమోదైనట్లు వెల్లడించింది. నలుగురు ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార కేసు నమోదయింది. బీజేపీకి చెందిన 85 మంది ఎంపీల్లో 23 మందిపై, కాంగ్రెస్ నుండి 30 మందిలో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.


More Telugu News