తను టీడీపీలోకి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది: యార్లగడ్డ వ్యాఖ్యలపై సజ్జల

  • పోతే పోనీ అని తాను అన్నట్లుగా వక్రీకరిస్తున్నారన్న సజ్జల
  • తానే కాదు.. పార్టీలో ఎవరూ అలా అనరని స్పష్టీకరణ
  • ఏదైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలని సూచన
  • బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఇలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య  
  • చంద్రబాబు ఏం చెబితే జనసేనాని అది చేస్తారన్న సజ్జల
తనను పార్టీ నుండి పోతే పోనీ అన్నారని యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. యార్లగడ్డను పోతే పోనీ అని తాను ఎప్పుడూ అనలేదని, తాను అన్నట్లుగా వక్రీకరిస్తున్నారన్నారు. అసలు తానే కాదని, పార్టీలో ఎవరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. పార్టీలో కూడా అతనిని ఎవరూ అవమానించలేదన్నారు. యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పామని తెలిపారు. పార్టీ కోసం పని చేయాలని, అలాగే వైసీపీలో ఎక్కువమంది టిక్కెట్ కోసం పోటీ పడతారని, అందరికీ అవకాశం రాకపోవచ్చునన్నారు. కొంతమందికే అవకాశం ఉంటుందని, కాబట్టి మిగతా వారిని మేం కన్విన్స్ చేయాలన్నారు. అలా కాదంటే వారికి స్వేచ్ఛ ఉందని చెప్పారు. 

ఏదైనా ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలని, తనకు బాధ కలిగిందని తనతో, ఇతర సీనియర్ నేతలతో చెప్పాల్సిందన్నారు. అసంతృప్తి ఏమైనా ఉంటే బయటకు రావడం కాదని, పార్టీలో చర్చించి టిక్కెట్ కోసం కన్విన్స్ చేయాలని లేదంటే వారే కన్విన్స్ కావాలన్నారు. కానీ బహిరంగంగా అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమావేశం చూస్తుంటే అతను ముందే టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తాను, ఇతర సీనియర్ నాయకులు ఎవరు కూడా పోతే.. పో అనలేదన్నారు. అలా అనడానికి వారు ఏమైనా మన ఇంట్లో పని చేసేవారా? అన్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సజ్జల


జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు ఉన్నాడని తెలిసిపోతోందని సజ్జల అన్నారు. చంద్రబాబు ఏం చెబితే జనసేనాని అది చేస్తారన్నారు. వారు విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా ఇద్దరూ ఒకటే అన్నారు. ప్రతిపక్ష ఓటు చీలకూడదని పవన్ చెబుతున్నారని గుర్తు చేశారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలా? విడిగా పోటీ చేయాలా? అనే దానిని తేల్చేది పవన్ కాదని, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ఘోరాలు జరిగాయని దుయ్యబట్టారు. టార్చ్ లైట్ టెక్నాలజీని కనిపెట్టింది కూడా తానే అంటాడని, అలాంటి చంద్రబాబును చూసి అందరూ నవ్వుకుంటున్నారన్నారు.


More Telugu News