మానసికంగా సమస్యలున్న వ్యక్తితో అందరూ ఇబ్బంది పడతారు: చంద్రబాబు

  • కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
  • అమలాపురంలో ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం
  • వివిధ రంగాల నిపుణులను కలుసుకున్న చంద్రబాబు
  • వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయన వివిధ రంగాల నిపుణులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణుల సలహాలు తీసుకున్నారు. తన ఆలోచనలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. నిపుణులు కూడా రాష్ట్ర ప్రగతి కోసం పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. అన్ని రంగాల సమన్వయంతోనే రాష్ట్రం ముందుకు పోతుందని స్పష్టం చేశారు.

వివిధ రంగాల నిపుణుల సూచనలు, అభిప్రాయాలు... చంద్రబాబు గారి స్పందన

ప్రభాకర్ (వైద్యుడు): మీ ఆలోచనా విధానంతో వాజ్ పేయి హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగేలా చేశారు. 2000 సంవత్సరంలో కోనసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ, నూతన రైల్వేలైన్, జాతీయ రహదారితో అనుసంధానం కల్పించారు. మెడికల్ కాలేజీ రావడంతో ఈ ప్రాంతంలో వైద్యుల సంఖ్య పెరిగింది. వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. పుట్టే ప్రతి బిడ్డ కు ఆరోగ్యబీమా కల్పించాలి. అలానే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభించేలా ఆలోచించాలి.

చంద్రబాబు స్పందన: ఏ ప్రాంతానికైనా కనెక్టివిటీ అనేది కీలకం. రోడ్లు, రైల్వే, వాయు, జలరవాణా ఎంత పటిష్టంగా ఉంటే, ఆయా ప్రాంతాలు అంత త్వరగా అభివృద్ధి చెందుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కనెక్టివిటీ  సౌకర్యాలు పెరగాలి. 

కోనసీమ ప్రాంతంలో వనరు లు ఎక్కువ. వాటిని సద్వినియోగం చేసుకుంటే, ఈ ప్రాంతం చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం విజువలైజ్  చేసి, ఎగ్జిక్యూట్ చేసింది తరువాతి ప్రభుత్వాలు కొనసాగించాలి. కానీ దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరగడంతో చాలా నష్టం జరిగింది.

మూడుపూటలా తిండిలేని వాడి గురించి మీరు, నేను ఆలోచించడమే నిజమైన మానవత్వం. మీరు ఇంత వృద్ధిలోకి వచ్చారు.... ఒక్కొక్కరు ఒక్కో పేద కుటుంబాన్ని బాగుచేయలేరా? 

ఒక తరం సెటిల్ అయ్యేలా చేస్తే, తరువాతి తరం మీతో పాటు సమానంగా వృద్ధిలోకి వస్తారు. మనందరం ఇప్పుడు ఇన్ స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం. సరైన స్పష్టత ఉన్న నాయకత్వం ఇప్పుడు చాలా అవసరం.

విష్ణుమూర్తి (వైద్యుడు): ప్రభుత్వాలు ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నా సగటు గ్రామీణ పేదలకు ఉపయోగం ఉండటంలేదు. ఎలాంటి విద్యాసంస్థలున్నా నాణ్యమైన విద్య లభించడం లేదు. సామాన్యుడికి ఉపయోగపడేలా వైద్య వ్యవస్థలో మార్పులు రావాలి. దానిపై మీరు ఎలా చేస్తారు?

చంద్రబాబు స్పందన: దేశంలో1991 తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చాకే పోటీతత్వం పెరిగింది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ఉండి, పేషంట్లకు నచ్చిన వైద్యుడి వద్ద మంచి వైద్య సేవలు అందితే బాగుంటుందేమో! కొన్ని విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన అందుతోంది. కొన్నింటిలో సరైన బోధన అందడంలేదు. 

ప్రతి ఒక్కరికీ చదువుతో పాటు కామన్ సెన్స్ చాలా అవసరం. నేను ఇంజినీరింగ్ కళాశాలలు పెట్టి, పెంచుకుంటూపోతున్నప్పుడు ఎందుకిన్ని కళాశాలలు అన్నారు. సరైన బోధనా సిబ్బంది లేరన్నారు. అప్పుడు ఉన్నత చదువు చదివినవాడు, కిందిస్థాయి వాడికి బోధిస్తాడు అన్నాను. ప్రతి ఒక్కడికీ చదువుతో పాటు స్కిల్స్ నేర్పితే, ప్రపంచాన్ని జయించడం యువతకు సాధ్యమవుతుంది. 

ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించి,  దానితో మంచి వైద్యం అందించాలి. మీరు చెప్పినవాటిపై ఆలోచిస్తాను. సమస్యలకు పరిష్కార మార్గాలు మీరు కూడా ఆలోచించాలి.

ధన్వంతరీనాయుడు (వైద్యుడు): మా నాన్నగారు రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు, వైద్యుడు, న్యాయవాది ఈ ముగ్గురూ నిరంతర విద్యార్థులుగా ఉండాలని మా నాన్నగారు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యువత ఆత్మహత్యలు బాగా పెరిగాయి. వాటిని నిరోధించాలి.

చంద్రబాబు స్పందన: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి మినిమమ్ స్టాండర్డ్స్ ఉండాలి. యువతలో ఆత్మహత్య చేసుకోవాలన్నఆలోచనలు ఎందుకు వస్తున్నాయి... అవి రాకుండా మనమేం చేయగలం? 

అలానే యువత, చిన్నపిల్లలుకూడా ఎక్కువగా సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. యువతకు, చిన్నపిల్లలకు మానసిక వికాసంపై అవగాహన పెంచాలి.
మానసికంగా సమస్యలున్న వ్యక్తితో అందరూ ఇబ్బంది పడతారు. 

ఈ ముఖ్యమంత్రి ఆలోచనలు ఏమిటో, ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు. 60 ఏళ్ల నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తున్న మార్గదర్శిలాంటి సంస్థను ఎందుకు లేకుండా చేయాలనుకుంటున్నారు?

మహమ్మద్ ఆదం (న్యాయవాది): ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మీరు చూపే పనితీరుకి ఎలాంటివారైనా మీకు అభిమానులు కావాల్సిందే. 1996 నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మీ ఆలోచనలు అమలు చేయాల్సింది అధికారులే. కానీ వారు సాధారణ ప్రజలకు ఎంత దగ్గర అవుతున్నారన్నది చాలా ముఖ్యం. పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనితీరుని క్లోజ్ గా పరిశీలించాలి. అధికారంలోకి వచ్చాక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నాం.

చంద్రబాబు స్పందన: స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలు అమలవుతున్నాయి. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు నేను ఉన్నప్పుడు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేశాయి. ఇదే పోలీస్ వ్యవస్థ తీవ్రవాదుల్ని అణచివేసి, మతసామరస్యాన్ని కాపాడింది. అదే వ్యవస్థ ఇప్పుడు పైవాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నారు. 

నేను ఎప్పుడూ ప్రత్యర్థుల్ని అణచివేయాలని ఆలోచించలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటనకు వెళ్లి, ఒక మంత్రి అవినీతిని ప్రశ్నిస్తే, నాపై రాళ్లదాడి చేశారు. పోలీసులు చూస్తూ నిలబడ్డారు. అక్కడ... చేయాల్సిన దారుణం వాళ్లు చేసి, నాపైనే 307 కేసు పెట్టారు. తప్పుని తప్పు అని చెప్పకపోతే, మీకు అన్యాయం జరిగితే రేపు ఎవరూ ముందుకు రారు. 

నిన్న జొన్నాడలో ఇసుక రీచ్ ను సందర్శించాను. మే నెల నుంచి రాష్ట్రంలో జరిగే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలాంటి కాంట్రాక్టర్ లేడు. దానిపై నేను ప్రశ్నిస్తే అది తప్పా? మేధావి మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనేది నినాదంగానే మిగిలిపోవడం బాధాకరం.

వర్మ (ఆక్వారైతు): 30 ఏళ్లుగా ఆక్వాసాగులో ఉన్నాను. ఈ నాలుగేళ్లలో ఎన్నడూ పడని ఇబ్బంది పడుతున్నాం. యూనిట్ విద్యుత్ రూ.2లకు మీరు అందించినప్పుడే బాగుంది. ఇప్పుడు రూ.1.50 పైసలకు ఇస్తున్నా ఉపయోగం లేదు. మిగతా వాటి ధరలు పెంచేశారు.

చంద్రబాబు స్పందన: రాయలసీమలో హార్టీకల్చర్, కోనసీమలో ఆక్వా రంగం, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలనుకున్నాను. దానికి తగినట్టే ప్రణాళికాబద్ధంగా పని చేశాను. 

ఐదేళల్లో ఆక్వారంగంలో 30 శాతం వృద్ధి రేటు వచ్చింది. చిన్న రైతు, పెద్ద రైతు అని లేకుండా  ఆక్వా రంగాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేశాను. ఆక్వారైతుల్ని కచ్చితంగా ఆదుకుంటా” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.


More Telugu News