వివేకా హత్య కేసు: అజేయ కల్లం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

  • తన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్న అజేయ కల్లం
  • చార్జిషీట్‌లో తన స్టేట్‌మెంట్‌ను తొలగించి, మళ్లీ రికార్డు చేయాలని విజ్ఞప్తి
  • సీబీఐ దర్యాప్తు వెనుక దురుద్దేశం కనిపిస్తోందని ఆరోపణ
వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందని తన పిటిషన్‌లో అజేయ కల్లం ఆరోపించారు. 

గత వారం జరిగిన విచారణ సందర్భంగా అజేయ కల్లం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీఆర్‌‌పీసీ సెక్షన్ 161 ప్రకారం నోటీసు ఇవ్వలేదని, మెసేజ్ చేసి విచారణకు పిలిచారని కోర్టుకు తెలియజేశారు. అజేయ కల్లం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయలేదని చెప్పారు. అప్పటి విచారణ అధికారి వికాస్ సింగ్ కాగా.. స్టేట్‌మెంట్‌పై సంతకం మాత్రం ముఖేశ్ శర్మది ఉందని వివరించారు. సీనియర్‌‌ ఐపీఎస్‌లు అయి ఉండి కూడా ప్రొసీజర్ ఫాలో కాలేదని విమర్శించారు.

తాను చెప్పింది యథాతథంగా రికార్డులోకి తీసుకోలేదని, సీబీఐ దర్యాప్తు వెనుక దురుద్దేశం కనిపిస్తోందని ఆరోపించారు. చార్జిషీట్‌లో పేర్కొన్న తన స్టేట్‌మెంట్‌ను తొలగించాలని, తిరిగి స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. పిటిషన్‌ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రోజు విచారణకు స్వీకరిస్తున్నట్లు చెప్పింది.


More Telugu News