నాకు క్లాస్ మేట్స్ ఉంటే.. జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారు: నారా లోకేశ్ వ్యంగ్యం

  • కంతేరులో 14 ఎకరాల పొలాన్ని కొన్నానని అసత్య ప్రచారం చేశారన్న లోకేశ్
  • పోసాని రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని వ్యాఖ్య  
  • తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆరోపణ
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని కృష్ణమురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్ పై ఆయన కేసు వేశారు. తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్ కొన్నారని పోసాని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. దీంతో వారిపై లోకేశ్ పరువునష్టం కేసులు వేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వీరికి న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని అన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగించినందుకు కోర్టులో పరువునష్టం కేసు వేశానని చెప్పారు. కంతేరులో తనకు భూమి ఉన్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పోసాని రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశానని, రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. మంగళగిరిలో గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. 

తనది కాలేజ్ లైఫ్, జగన్ ది జైల్ లైఫ్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. తనకు క్లాస్ మేట్స్ ఉంటే, జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని విమర్శించారు. తాను విదేశాలకు వెళ్లాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని, జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. జగన్ సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఏపీలో ఆపేశారని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నామని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదని చెప్పారు. 

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని లోకేశ్ ఆరోపించారు. తన తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులైనప్పటికీ తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని... 2024 నుంచి 2029 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News