జిల్లాకు ఒకటి కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం: చంద్రబాబు

  • కోనసీమ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • అమలాపురంలో ప్రజావేదికలో మాట్లాడిన టీడీపీ చీఫ్
  • ఇంజనీరింగ్ కళాశాలలు పెడితే తనను ఎగతాళి చేశారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు ఒకటి, కొన్ని జిల్లాలకు ఒకటి కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. మెడిసిన్ తో పాటు పారా మెడికల్ విద్యార్థులకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈమేరకు కోనసీమ జిల్లాలోని అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పోటీతత్వం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే తనను ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే, అందులో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం విదేశాలలో స్థిరపడ్డారని చెప్పారు. ప్రపంచాన్ని జయించే శక్తి మన దేశ యువతలోనే ఉందని చంద్రబాబు తెలిపారు.

ప్రభుత్వం కానీ, ఏ రంగంలోనైనా కానీ మనం ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసిన పనులను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కావాలని చంద్రబాబు చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే కొరవడిందని అన్నారు. సమాజంలో పది శాతం ఉన్న వారికి మేలు చేయడం కాకుండా నిరుపేదలకు మూడు పూటలా తిండి లభించేలా, సామాన్యులు ఆర్థికంగా పైకి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా తాను పాలసీలు సిద్ధం చేశానని చంద్రబాబు తెలిపారు. అది సాధ్యమేనని, తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. తెలివి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు ముందుకు వెళ్లడమే కాకుండా అవకాశాలు లేని వారిని వారి వెంట తీసుకెళ్లాలని అన్నారు. పేదవారిని ధనవంతులుగా చేయడమే నిజమైన సంతృప్తి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.


More Telugu News