బీజేపీలో చేరికలపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

  • త్వరలో 22 మంది నేతలు కాషాయ జెండా కప్పుకుంటారని వెల్లడి
  • ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కామెంట్స్
  • అమిత్ షా రాష్ట్ర పర్యటనలో చేరికలు ఉంటాయని వివరణ
తెలంగాణలో బీజేపీని మరింత పటిష్ఠం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో కీలక నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈమేరకు నిర్మల్ లో ఓ మీడియా సంస్థతో ఈటల మాట్లాడారు. ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 22 మంది కీలక నేతలు బీజేపీలో చేరతారని వివరించారు. ఆ తర్వాత కూడా పార్టీలోకి చేరికలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్రంలో బీజేపీలోకి చేరికల వ్యవహారాలు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటి వరకూ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే, పార్టీలో చేరికలకు సంబంధించి వివిధ పార్టీల నేతలతో చర్చలు కొనసాగించినట్లు ఈటల తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. బీజేపీలోకి త్వరలో 22 మంది నేతలు చేరుతున్నారని, రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేశారు. పైగా పార్టీలో చేరేవాళ్లంతా గెలుపు గుర్రాలేనని తెలిపారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పార్టీలో చేరికలపై స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే పార్టీ తరఫున బరిలోకి దింపుతామని చెప్పారు.


More Telugu News