మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేశ్
- పోసాని, సింగళూరు శాంతిప్రసాద్‌పై పరువు నష్టం కేసు పెట్టిన లోకేశ్
- వారిపై చర్యలు తీసుకోవాలంటూ దావా
- ఈ రోజు వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు రాక
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ రోజు మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వచ్చారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, సింగళూరు శాంతిప్రసాద్‌పై లోకేశ్ గతంలో పరువు నష్టం కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేశ్ విరామమిచ్చారు. శనివారం సాయత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఓ వార్తా సంస్థ యూట్యూబ్ చానల్‌కి పోసాని కృష్ణమురళి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేశ్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అన్నారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోర్టుని ఆశ్రయించారు.
ఓ చర్చా కార్యక్రమంలో సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి.. తనపై నిరాధార ఆరోపణలు చేసినట్టు లోకేశ్ ఆరోపిస్తున్నారు. దీనిపైనా తన న్యాయవాది ద్వారా శాంతి ప్రసాద్‌కు నోటీసులు పంపారు. ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంతో శాంతి ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టుని ఆశ్రయించారు.