డబ్బుకు ఆశపడి రాఫెల్ ఫొటోలను ఐఎస్ఐకి పంపించిన యువకుడు.. అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

  • ఐఎస్ఐ ఏజెంట్ గా మారి దేశంలో పేలుళ్లకు కుట్ర
  • పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న ఎస్టీఎఫ్ సిబ్బంది
  • యువకులను జిహాదీలుగా మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణ
పాకిస్థాన్ లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లిన ఉత్తరప్రదేశ్ యువకుడిని ఐఎస్ఐ ఏజెంట్లు ట్రాప్ చేశారు.. ఊహించనంత డబ్బు ఇస్తామని ఆశపెట్టడంతో వాళ్లు అడిగిన పని చేయడానికి సిద్ధమయ్యాడు. భారత్ కు తిరిగి వచ్చాక దేశంలోని భద్రతా ఏర్పాట్లు, రాఫెల్ యుద్ధ విమానం సహా కీలకమైన ఏర్పాట్లకు సంబంధించి వాట్సాప్ ద్వారా ఐఎస్ఐ టెర్రరిస్టులకు చేరవేశాడు. దేశంలో దాడులు చేయడం ద్వారా అశాంతిని సృష్టించాలని కుట్ర పన్నాడు. అయితే, సదరు యువకుడి గురించి పక్కా సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం..

మీరట్ కు చెందిన కలీమ్ అహ్మద్ డబ్బు కోసం ఐఎస్ఐ ఏజెంట్లతో చేతులు కలిపాడు. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి వచ్చాక మారు పేరు, తప్పుడు చిరునామాతో సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ ద్వారా మన దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలను పాకిస్థాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడు. యువతను రెచ్చగొట్టి జిహాదీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నాడు.

రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. కలీమ్ వ్యవహారంపై ఓ ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందిందని, వెంటనే దాడులు చేసి కలీమ్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కలీమ్ ఇంట్లో సోదాలు జరపగా.. మారుపేరుతో తీసుకున్న సిమ్ కార్డు, అందులో పాకిస్థాన్ నెంబర్లు, ఆయుధాలతో పాటు పలు కీలక ఆధారాలు దొరికాయని వివరించారు. కలీమ్ సోదరుడు తహసీన్ అలియాస్ తసీమ్ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.


More Telugu News