చదువుకున్న వారికి ఓటేయమని విద్యార్థులకు సూచించిన టీచర్‌కు ఊస్టింగ్.. స్పందించిన సీఎం

  • అన్‌అకాడమీలో ఉపాధ్యాయుడి తొలగింపు వివాదాస్పదం
  • చదువుకున్న వారికి ఓటేయాలంటూ ఆన్‌లైన్ క్లాస్‌రూంలో విద్యార్థులకు సూచించినందుకు ఊస్టింగ్
  • తరగతి గది నిబంధనలను ఉపాధ్యాయుడు ఉల్లంఘించాడని సంస్థ వ్యవస్థాపకుడి ఆరోపణ
  • ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందన, ఉపాధ్యాయుడి చర్యలో తప్పేముందని సూటి ప్రశ్న
ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీ వివాదంలో చిక్కుకుంది. చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ఉపాధ్యాయుడిని తొలగించడంతో సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఉపాధ్యాయుడి తొలగింపు అన్యాయమని అన్నారు. కాగా, ఉద్యోగం పోగొట్టుకున్న ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ రేపు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఇటీవల ఆయన తన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. 

‘‘కొన్ని రోజులుగా నెట్టింట్లో నాకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నేను వివాదానికి కేంద్రంగా మారాను. జ్యుడీషియల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న నా స్టూడెంట్లు కూడా ఈ కాంట్రవర్సీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. నాపైనా ప్రతికూల ప్రభావం పడింది’’ అని కరణ్ చెప్పుకొచ్చాడు. వివాదాస్పదంగా మారిన వైరల్ వీడియోలో కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని సూచించారు. 

కాగా, కరణ్ తొలగింపుపై అన్అకాడమీ వ్యవస్థాపకుడు, రోమన్ శైనీ  ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కరణ్ సంగ్వాన్ క్లాస్ రూం నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించేందుకు తరగతి గది వేదిక కారాదని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.  

కాగా, ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా స్పందించారు. ‘‘చదువుకున్న వారికి ఓటేయాలని సూచించడం నేరమా? నిరక్షరాస్యులంటే నాకు గౌరవమే కానీ ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు వారు అనర్హులు. ఈ టెక్నాలజీ యుగంలో నిరక్షరాస్యులైన ప్రజాప్రతినిధులు ఆధునిక భారత్‌ను నిర్మించలేరు’’ అని సీఎం ట్వీట్ చేశారు.


More Telugu News