గ్రూపు రాజకీయాలు నా దగ్గర సాగవు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వార్నింగ్

  • తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాటికి చెక్ పెడతానన్న ఎమ్మెల్యే
  • వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసేది తానేనని స్పష్టీకరణ
ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తాను జనగామ నుంచి పోటీ చేయడం పక్కా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కొందరు పనిగట్టుకుని పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, తనకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసని, ఆయన ఆదేశాలతో త్వరలోనే వాటికి చెక్ పెడతానని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని నోమా ఫంక్షన్ హాల్‌లో నిన్న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జనగామ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి సీఎంకు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న వారి ఆటలు తన వద్ద సాగవని హెచ్చరించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికే జనగామ టికెట్ కేటాయించాలంటూ జిల్లాలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కాపీలను ఎమ్మెల్యేకి అందజేశారు.


More Telugu News