అమెరికా అధ్యక్షుడి ఎన్నికల రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతి అభ్యర్థిపై ఎలాన్ మస్క్ ప్రశంసలు

  • రిపబ్లికన్ పార్టీ తరపున యూఎస్ అధ్యక్షుడి ఎన్నికల రేసులో వివేక్ రామస్వామి
  • వివేక్ సరైన అభ్యర్థి అన్న ఎలాన్ మస్క్
  • వివేక్ తల్లిదండ్రులు కేరళకు చెందిన వారు 
భారత సంతతికి చెందిన మిలియనీర్ వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడి ఎన్నికల బరిలో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన రేసులో కొనసాగుతున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ లకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ పోటీలో శక్తిమంతమైన ట్రంప్ ను దాటుకుని ముందుకు రావడం అంత ఈజీ కానప్పటికీ... ఆయనకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ కంటే ఎక్కువ మద్దతును వివేక్ ఎలా కూడగడతారనేది ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు, వివేక్ రామస్వామిపై అపర కుబేరుడు, టెక్ దిగ్గజం, సోషల్ మీడియా దిగ్గజం X అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వివేక్ సరైన అభ్యర్థి అని మస్క్ అన్నారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో వివేక్ పాల్గొన్నారు. వివేక్ ను ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్ సన్ ఇంటర్వ్యూ చేశారు. రిపబ్లికన్ పార్టీ చరిత్రలోనే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అతి చిన్న వయస్కుడు 37 ఏళ్ల వివేక్ రామస్వామి అని కార్ల్ సన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ... 'వివేక్ సరైన అభ్యర్థి' అని రీట్వీట్ చేశారు. 

వివేక్ రామస్వామి వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే... ఆయన తల్లిదండ్రులు కేరళలో జన్మించారు. వీరు అమెరికాకు వలస వెళ్లారు. వివేక్ అమెరికాలోని సిన్సినాటిలో జన్మించారు. హార్వర్డ్, యేల్ యూనివర్శటీల్లో ఆయన విద్యాభ్యాసం చేశారు.  వివేక్ సంపద విలువ దాదాపు 630 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తాజాగా అంచనా వేసింది. విజయవంతమైన బయోటెక్ వ్యాపారవేత్తగా వివేక్ గుర్తింపు పొందారు. ఈయన కంపెనీ ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలతో పాటు పలు మందులను అభివృద్ధి చేసింది.


More Telugu News