గుండెపోటుకు గురైన చైనా వ్యక్తి... చిమ్మచీకట్లో ఎయిర్ లిఫ్ట్ చేసిన భారత కోస్ట్ గార్డ్

  • చైనా నుంచి యూఏఈ వెళుతున్న పరిశోధన నౌక
  • ముంబయి తీరానికి 200 కి.మీ దూరంలో నౌక
  • గత రాత్రి ఓ వ్యక్తికి గుండెపోటు
  • ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కేంద్రానికి సమాచారం
  • వెంటనే స్పందించిన భారత కోస్ట్ గార్డ్
భారతదేశ పశ్చిమాన అరేబియా సముద్ర తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ నౌకలోని వ్యక్తి గుండెపోటుకు గురికాగా, రాత్రి వేళలోనూ భారత కోస్ట్ గార్డ్ దళం అతడిని ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాణాలు కాపాడింది. 

పనామా పతాకంతో ఉన్న ఓ పరిశోధన నౌక (ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్-2) చైనా నుంచి యూఈఏ వెళుతోంది. ఆ నౌకలో పనిచేస్తున్న యిన్ వీంగ్ యాంగ్ అనే వ్యక్తి గత రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీనొప్పితో ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. 

దాంతో ఆ చైనా నౌకలోని సిబ్బంది ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు సమాచారం అందించారు. రాత్రి వేళ అయినప్పటికీ కోస్ట్ గార్డ్ దళం వెంటనే స్పందించింది. భారత కోస్ట్ గార్డ్ కు చెందిన ఓ బృందం ఏఎల్ హెచ్ ఎంకే-3 హెలికాప్టర్ లో చైనా నౌక వైపు బయల్దేరింది. 

ప్రతికూల వాతావరణంలో, చిమ్మచీకట్లో ప్రయాణించిన ఆ హెలికాప్టర్... ఎట్టకేలకు చైనా నౌకను చేరుకుంది. బాధితుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షితంగా తీరానికి తీసుకువచ్చింది. సకాలంలో అతడిని ముంబయిలోని ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎంతో సాహసోపేతంగా ఈ కార్యాచరణను పూర్తి చేసింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.


More Telugu News